జవము

 

జులై 22, 2022

జవము (javamu)

    అర్థము

   (విశేష్యము): వడి; వేగము; సత్వము; దేహబలం 

   Meaning

   (noun) : swiftness; quick; bodily strength

   వాడుక / Usage

  హద్దులకు ఎత్తూ, పొడవు, వెడల్పు జవముగా చేరగా, రోదసి భూత వర్తమాన భవిష్యత్తయింది విశ్వయానంలో.
   As space quickly gained dimensions, it became time - before, now and after - in the journey of Universe.

   మెదడుకు మేత / Food for thought

 నువ్వెప్పుడూ యింతే,

మనం కలిసినప్పుడల్ల
ఆ పాతకాలపు సందూకను
తీయిస్తవు .

దాన్ని తీసినప్పుడల్ల
పైనున్న దుమ్ము చెదిరిపోయి
మన చిన్నతనం
మాసిపోతుందేమోనని
నాకు ఒకటే రంది.

సందుక మూత
కిర్రుమంటు
తెరుచుకుంటుంటే
‘తిన్నవా బిడ్డా’ అంటూ
వీపు నిమిరే నాయనమ్మ
తొక్కులాట యాదికొస్తది.

పల్లె నుండి పట్నందాకా
సర్వీసు బస్సులో ప్రయాణం
చేసిన పేదరికపు
గునకపూలు
ఇంటినిండ పూస్తయి.

రంగు పోయిన
పక్షి ఈకలూ
ఎండి పోయిన
బంతిపూల రిక్కలు
రాలిపోయిన
బంగారుపురుగు రెక్కలూ….

మనం నీటి మీద
దుంకులాడించిన
పెంకాసు ముక్కలూ..

ముదురు రంగులోకి
జీర్ణమవుతున్న
అట్టలు లేని పుస్తకాలూ …

ఎప్పుడో గాని కాలానికి
మత్తడి దుంకే
మన వూరి చెరువును
గుర్తు తెచ్చే

ఒకటో రెండో
సగం చినిగిపోయిన
కరపత్రాలు.

‘అంతా ఐపోయిందిప్పుడు
కాలం ఐపోయింది ‘

ముసలి కాగితం రాలిపడుతున్న
పుస్తకాల్ని ఒకటొకటిగా
బయటకు తీస్తూ అంటవు .

‘ వీటిల్లో ఈ రాతలకింక
కాలం చెల్లిపోయింది

చెరిపేయాలి వీటన్నిటినీ ‘

ఊపిరి పోసిన
ఒక్కో వాక్యం కింద
అరిగిన పెనిసిలుతో
గీసుకున్న గీతలు
అక్కడక్కడా మడుచుకున్న
కమ్మలూ
పక్కన మార్జినులల్ల
రాసుకున్న నోట్సూ …..

సందూక
అడుగు నుంచి
తెరలు తెరలుగా
బాగా పరిచయమున్న
ఒక కొత్త సువాసన
చుట్టుముడుతుంది.

చెంపకానించుకున్నప్పుడు
వెచ్చని వాగు నీటి కింది
గరుకైన ఇసుక
మెత్తదనం ఆపేక్షగా తగుల్తుంది.

‘అత్తా పత్తా లేకుండా
వీడెక్కడ తిరుగుతుండో ‘
పాత కళ్ళద్దాల్లోంచి
తండ్లాడే బాపు
కండ్లల్లో మెదులుతాడు.

కొమ్మల్ని తాకంగానే
జల జలా రాలే
ఒనగాయల్లా
ఒక్కో కాయితం లోనుండీ
గడచిన క్షణాలు
ఉక్కిరి బిక్కిరి చేస్తయి .

‘యెట్ల చెరిపేసుకుంటం ?

అరచేతుల్లో భాగమైన వాటిని….

యెంత యెలిసి పోయినా
యెట్లా పారేసుకుంటం ?

మన తొలియవ్వనాల
రంగుల రంగుల
ఉద్రేకాల్ని?

యెట్లా విడదీస్తాం ?
మన ఇంట్లో ఒక అందమైన
మూలగా అమరిపోయిన
సందూకను …. ‘

గడచిన మనల్ని
మనం మళ్ళీ
అతిజాగ్రత్తగా మడత పెట్టుకుని
సందూకలో
భద్రపర్చుకుందాం.

ఎప్పుడైన
ఏదో పోగొట్టుకున్నట్టు
ఓర్చుకోలేని దుఖము
కలిగినప్పుడు
ఇంట్లో ఈ జాగకాడికొచ్చి
సందూక బుజానికి
తల ఆనించుకుంటే
యెంతో ఊరట !

-- నారాయణ స్వామి వెంకట యోగి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి